21రోజుల దేశవ్యాప్త లాక్డౌన్ సమయంలో అన్ని క్రీడా శిక్షణ శిబిరాలు, కేంద్రాలు మూతపడే ఉంటాయని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. అథ్లెట్లు ఇండ్లలోనే ఉండి శారీరక, మానసిక ఫిట్నెస్ను మెరుగుపరుచుకునేందుకు కృషి చేయాలని సూచించారు.
‘ప్రభుత్వ సూచనల మేరకు 21రోజుల లాక్డౌన్ కాలంలో అన్ని క్రీడా శిక్షణ కేంద్రాలు, శిబిరాలు మూతపడే ఉంటాయి. అథ్లెట్లు ఉన్న చోటనే.. శారీరక, మానసిక ఫిట్‌నెట్‌ను మెరుగుపరుచుకునేందుకు కృషి చేయండి. బయటకు మాత్రం రావొద్దు’ అని కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. సాయ్ పరిధిలోని అన్ని శిక్షణ కేంద్రాలు, శిబిరాలను ఇప్పటికే ఈ నెల 31వరకు బంద్ చేయగా, తాజా లాక్‌డౌన్‌తో మరింత కాలం కొనసాగనుంది. కాగా, కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా 21రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
అలాగే టోక్యో ఒలింపిక్స్‌ను ఏడాది వాయిదా వేయడాన్ని రిజిజు స్వాగతించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో.. అథ్లెట్ల క్షేమం కోసం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) తీసుకున్న నిర్ణయం మంచిదేనని అభిప్రాయపడ్డారు. విశ్వక్రీడల వాయిదాతో అథ్లెట్లు ఏ మాత్రం నిరాశ చెందాల్సిన అవసరం లేదని, వచ్చే ఏడాది మంచి అవకాశాలు దక్కుతాయని ధైర్యం చెప్పారు. అలాగే 2021లో భారత అథ్లెట్లు మంచి ప్రదర్శన చేసి ఎక్కువ పతకాలు సాధిస్తారని కేంద్ర మంత్రి రిజిజు ఆశాభావం వ్యక్తం చేశారు.